Monday, April 5, 2010

గడుసు శృంగారం

                                            ..శృంగారం లో ' గడుసు శృంగారం ' కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా ! ఉందండీ బాబూ..కళలలో కేవలం అరవై నాలుగు మాత్రమే ఉన్నాయి కానీ ' శృంగార కళ 'కి ఎన్ని ఉప-కళ లున్నాయో వాటిని సృష్టించిన రతీ రాజు 'మన్మధుడు' కే తెలియదు , మానవ మాత్రుడను నాకేం తెలుసు ! కాక పొతే మరేమిటి అండీ........ఉక్కు పిండం లాంటి ' భీముడిని' ముక్కు పిండి మరీ చటుక్కున అక్కున చేర్చుకుని మక్కువ తీర్చుకున్న టక్కు టమార విద్యల జక్కనా శిల్పం ' హిడింబి ' మధ్య సాగే సరస సల్లాప శృంగారం .. 'గడుసు శృంగారం ' కాకపొతే మరేమవుతుందండి( ఇంకా నయం ' ఇనుప శృంగారం ' అన్నారు కాదు... అని నవ్వుకోకండి ) !
               మనం చర్చించుకోబోయేఈ పాటలో కవి గారు అదే పని చేసారండి . ' శ్రీ కృష్ణ పాండవీయం ' చిత్రంలో ' భీముడికి హిడింబి కి మధ్య మాంచి ' రొమాంటిక్' సాంగ్ వదిలారు . ఇక చూసుకోండి ...కోర మీసాలతో..కొర కొర చూపులతో ఉరిమి ఉరిమి ఐతే చూస్తాడు కానీ,వెనకెనుకే తిరుగుతుంటాడు ' హిడింబి 'ఆడి పాడు తుంటే ! హిడింబి ఆకర్షణ ఆది . హిడింబే కాదు....అందమైన ఆటవిక కన్నె వున్నా అదే పరిస్థితి .......పాపం భీముడిది ! ( ఇక 'జిక్కి ' గొంతు గురించి వేరే చెప్పాలా ..మత్తు మొత్తం ఒలక బోసింది )

చాంగురే బంగారు రాజా .....చాంగు చాంగు రే బంగారు రాజా
మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా...అయ్యారే నీకే మనసీయాలని వుందిరా ! /చాంగు

                       ఆదివాసిలలో భాష వుందో లేదో నాకు తెలియదు కానీ ' చాంగు ' ....' మజ్జారే ' అనడం ఇవన్నీ కవి కాల్పనికలే ! మనం 'హాయ్,హోయి' అన్నట్లు. ' చాంగు రే రాజా ' అంటూ పలకరించి ' బంగారు రాజా ' అంటూ ఉబ్బేసి, .'నచ్చావురా మగాడా '..' నీకు తప్ప వేరే ఎవ్వరికీ మనసివ్వలేనురా' అంటూ తిన్నగా ఎటువంటి అరమరికలు ...తిరకాసులు లేకుండా తన ఉద్దేశం ముందుంచింది !
  ముచ్చటైన మొలక మీసముంది..భళా అచ్చమైన సింగపు నడుముంది. జిగీ బిగీ మేనుందీ ..సొగసులొలుకు మోముందీ ,
మేటి దొరవు అమ్మకు చెల్లా ...నీ సాటి ఎవ్వరున్దుట కల్లా !        /చాంగురె /                                                                                                                                    గుబురు మీసాలు ఇప్పటి ఫాషను కానీ.......అప్పట్లో మోస్తరు శరీర సౌష్టవం వున్నా మగాడైనా కోరమీసం దువ్వుకుంటూ .....కనుసన్నల లోంచి ....ఓరగా చూపుల బాణం విసిరాడంటే ' నిన్ను ఇష్ట పడుతున్నానంటూ  ప్రపోజల్ చేసినట్టే ! అంతటి పవర్ వుండేది కోర మీసం లో ( మొలక మీసంలో ) !
             ' భళా అచ్చమైన సింగపు నడుముందీ ' .....ఇక్కడ....ఇక్కడే .... అతనంటే యెంత ఇష్టమో సూటిగా చెప్పింది. వేగంగా వురకాలన్నా .......వేటాడాలన్నా ......సన్నటి బలమైన నడుము తప్పని సరి ( ఇప్పుడు బి.యమ్ . అంటారు లెండి ). అల్లాంటి నడుముంటేనే చురుకైన కదలికలుంటాయి సింహానికి.....వేటాడేటప్పుడు ! కాబట్టే సింహానితో పోల్చి మరీ వలచింది ( ' ఆరు పలకలు ' ' నాలుగు పలకలంటూ ' చీపురుపుల్ల లాంటి వాళ్ళే బడాయి పోతూ వుంటే ' మిస్టర్ . ప్రపంచ బలశాలి ' భీముడు ఇంకెంత బడాయి పోవాలి ?).
అంతేకాదు '' నేనీమీ తక్కువ కాదు నాలోనూ ' విషయం ' వుంది.....నీకు సరితూగే జిగి బిగీ వున్న శరీరం ..ముద్దులొలికే మొహం కూడా వుంది కాబట్టి నేనేమీ తీసిపోనంటూ '' కవ్వింపు తో కూడిన సవాలు విసిరింది ! విసరడమే కాదు '' అమ్మ- తోడు నా సవాలు ను స్వీకరించే దమ్మున్న మొగాడు నీవు తప్ప నిస్సందేహం గా ఎవడూ లేడు ''..అంటూ అక్కడ బల్ల వుందో లేదో నాకు తెలియదు కానీ ' కుండ మాత్రం బద్దలు గొట్టినట్టుగా ' చెప్పింది !

మెత్త బడుతున్న ' భీముడిని ' చూసి........బెట్టు జార గొట్టేలా .....పట్టు సడలవివ్వకుండానట్టు బిగిస్తుంది చూడండి !

కైపున్న మజ్జగంటి చూపూ .....ఆది చూపు కాదు పచ్చల పిడి బాకు
పచ్చల పిడిబాకు .... విచ్చిన పూరేకు ......గుచ్చుకుంటే తెలుస్తుంది రా ......మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా !

             మోహావేశం లో ఉందేమో.....భీముని కొర కొర చూపు కూడా కైపు గానే కనబడుతుంది. కనబడటమే కాదు 'పచ్చల పిడి బాకు ' లా వుంది ఆంటుంది . చూసారా...చూసారా...మామూలు ' బాకు ' లా వుంది అనొచ్చుగా . మామూలు పిడి వున్న బాకు ఐతే అందులో విశేష మేముంది చెప్పండి ! సరిగా పట్టించుకోక పొతే పదును లేక మొండి కత్తిలా మిగిలి పోతుంది . అదే 'పచ్చలు తొడిగిన ' పిడివున్న బాకు ఐతే ...పదిలం గా ...శ్రద్ధ గా .ఎప్పటి కప్పుడు సాన పడుతూ,అదను చూసుకొని ..కదన రంగం లో దూకేంత, పదును ఉండేలా చూసుకొంటారు. ''అలాంటి పచ్చల పిడి బాకు లాంటి చూపుతో ...విచ్చిన ఆమె మనో పుష్పపు రేకులలో గుచ్చుకుంటే ..........అప్పటికి గానీ తెలుస్తుంది .....మనసిచ్చుకుంటే ఎలా వుంటుందో '' అని పారవశ్యం తో ఆంటుంది .

                        ''తూచ్ ...తూచ్.. మేమొప్పుకోము...అక్కడున్న దేంటి ? మీరు రాస్తున్నదేంటి ? పచ్చల పిడి బాకు ...విచ్చిన పూరేకు ..గుచ్చుకుంటే తెలుస్తుంది రా...అని అంత స్పష్టం గా వుంటే ''...అంటున్నారాఅయ్యా మీరు ఇలా తప్పుగా అర్ధం చేసుకుంటారనే ' చిత్రీకరణ లో ఆమె ను ఇద్దరిగా చూపిస్తూ ఒకరి చేతిలో చురకత్తి ( సారీ ...పచ్చల పిడి వుందో లేదో నాకు కనబడలేదు ) మరొకరి చేతిలో విచ్చిన తామరపూవును ఉంచాడు దర్శకుడు. అయినా సరే ...మీమొప్పుకోము అంటున్నారా ! సరే మహాను భావులారా ... సమాగపు ప్రతీకలను ప్రతిబింబించేలా ..కవి అలా వాడినా ఎక్కడైనా అశ్లీల మనిపిస్తుందంటారా ? అస్సలు అనిపించదు .... 'పైగా ఎంత సొగసుగా, ఎంత గడుసుగా కవ్విస్తుంది అతడిని ' అని అనిపిస్తుంది . ఇంకా ... పడుచుదనం లో .... కోడె వయసులో ..... గిలిగింతల పులకింతలు అన్నీ షరా మామూలే ' అంటుంది చూడండి !

గుబులుకొనే కోడె వయసు లెస్సా ....దాని గుబాళింపు ఇంకా హైలెస్సా !
పడుచుదనపు గిలిగింత .....గడుసు గడుసు పులకింత
ఉండనీయ నేమిసేతురా కైదండ లేక నిలువలేనురా .......చాంగురే.....!


అప్పటి దాక గుబులుకొని..గుబులుకొని..వున్న కోడె వయసు ....దాని గుబాళింపులు,గిలిగింతలు..పులకింతలు ...మనం అనుకున్నట్టు షరా మామూలు ఐతే బాగానే ఉండును .
షరా మామూలు కాస్తా ...కాలు నిలవనీయలేనంత గా ముదిరి పోయింది . అక్కడే వొచ్చి పడింది చిక్కంతా . అదుగో ..సరిగా సమయం లోనే సింగపు నడుమున్న ' భీమ బలుడు ' తగిలాడు. అందుకే అతని కైదండన బ్రతుకంతా నిశ్చింతగా గడిపేయ వొచ్చని అంతలా తాపత్రయ పడింది .

అదండీ .. బంతి లాంటి .పూబంతి సంగతి. కవి కల్పనా చాతుర్యానికి పోయింది నా మతి !
గతి తప్పిన మతి కావాలంటుంది బహుమతి ...తీరగా సరదాల కండూతి !
వీక్షించండి మరి  ..పిడిబాకు -పూరేకుల సంగతి !


http://www.youtube.com/watch?v=QAPWoHJO5hE

3 comments:

  1. super... ee concept e super... meeru chelaregi rayand memu celaregi chaduvutam !

    ReplyDelete
  2. బాగుంది.. ఇంకొన్ని విషయాలు మీకు మెయిల్ చేసాను చూడండి..

    ReplyDelete
  3. బాగుంది... మీ గడుసు సరసం మూర్తిగారు.

    మీకు కొన్ని పాటలు సజెస్ట్ చేయాలని ఓ తెగ ఇదయిపోతున్నాను. వేచి చూడండి.

    ReplyDelete