Saturday, April 17, 2010

కలయా .....నిజమా .........!

కలయా ...నిజమా ...తొలి రేయి హాయి మహిమా !
       అరె ఇదేంటి సార్ .....ఈ పాట ఈ మధ్యనే  ఎక్కడో విన్నట్టు ఉన్నదే ......ఓహో ఇది '' కూలీ నెం .1 '' సినిమా  లో పాట లా వుందే! భలే వారు సార్ ....ఏవో   ' అపాతమధురాలు ....అమలిన శృంగారాలు' అని ఈ పేజి కి వస్తే మీరేమో  'టాబు-వెంకటేష్ ' ల సినిమా  'కూలి .నెం. 1  ' లో పాట ను పట్టుకుని ' కలయా- నిజమా , తోలి రేయి హాయి మహిమా....  అనుకుంటూ గొప్ప పాటల జాబితా లో చేర్చారు ....ఇదేమన్నా బాగుందా '  అంటున్నారు కదూ !
            అయ్యో ...ఆగండి సార్ ....అలా తొందర పడకండి సార్ ! ఈ పాట ను ఇక్కడ చేర్చానూ ఆంటే....ఎంతో- కొంత ప్రత్యేకత వుంటుంది సార్.. పూర్తిగా చదివి ఓ అభిప్రాయానికి  రండి  సార్ !
****మొదటగా......ఇది ' ఇళయరాజా' తన సొంత గొంతు తో పాడిన రెండవ తెలుగు పాట !
****రెండవది.......' సుశీల ' తో కలసి పాడిన మొట్ట మొదటి పాట.
****మూడవది ...' సుశీల ' తో కలసి పాడిన చివరి పాట కూడా ఇదే !
****చివారాఖరుది......' టాబు ' ను తెలుగు తెరకు  తొలి సారిగా ' హీరొయిన్ ' గా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే !
            మనం ఇంతవరకూ  చర్చించు కున్నవి  కేవలం  మనసు పడ్డ ప్రేయసీ  -ప్రియుల మధ్య జరిగిన సరస -సల్లాప కార్య క్రమాలే ! కానీ.......ఇది అలా కాదు ........ఆ దశ ను దాటి..... పరిపక్వత సాధించి ....మనసుల కలయికను మూడు ముళ్ళ బంధం గా మార్చుకుని ....ఒకరికొకరు  తనువులు అర్పించుకునే .......తీయని .....సమాగపు తొలి రేయి  తాలూకు  ' తమకపు -గమకాలు ' !
              ** ఆమె : కలయా ...నిజమా....తొలి రేయి హాయి మహిమా !
              *అతడు : కలయా....నిజమా....తొలి రేయి హాయి మహిమా  !
              ** ఆమె : అలవాటు  లేని సుఖమా......ఇక నిన్ను ఆప తరమా !
           * అతడు : అణిగున్న ఆడతనమా .....ఇక నైన మేలుకొనుమా !
                                                                     /కలయా../
         నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది .....తొలి రేయి తాలూకు ......శరీర ధర్మ శాస్త్ర పరాకాష్ట ప్రకంపనల గురించి  కానే కాదు. ఆ ఉద్రేక  ...ఉద్విగ్న క్షణాల గురించి అంతకంటే కాదు !కేవలం  మనసుకే పరిమితమైన  'మధురోహ ' గురించి . అన్ని నాళ్ల  ఊహలకు రెక్కలోచ్చే వేళ ......మది పొందే ' మధు కీల ' గురించి ! సమాజ కట్టుబాట్ల కు విలువిస్తూ ....అంత కాలం తన మదిలోనే దాచుకున్న మధుర భావనలను.....తన స్త్రీత్వాన్ని .... ' తన అనుకున్న ' తన  జీవిత భాగ స్వామి కి .....పాదాక్రాంతం చేసే వేళ ఆమె పొందిన అలౌకిక ఉద్విగ్న భావోద్రేక స్థితి గురించి. అలవాటు లేని సుఖాలను అలవాటు చేసుకోక తప్పదు అని  ఆమె మనసు  పంపే సంకేతాలను అర్ధం చేసుకోలేని అయోమయ శారీరిక స్థితి గురించి. ఆమె డోలాయమానాన్ని అర్ధం చేసుకుని  ' ఆమె అణిగున్న ఆడతనాన్ని .....ఇకనుంచి అయినా కాస్త మేలుకొని ......ప్రణయ సామ్రాజ్య జగత్తును ఏలుకోమ్మనే ' అతని విజ్ఞప్తి గురించి .ఆ విజ్ఞప్తి ని పాటించిన తనువూ మనసు ' కలయా ...నిజమా ' అంటూ మళ్లీ పొందే సందేహాత్మక సుఖం గురించి ! ఇంత కంటే నేనీమి చెప్పగలనంటారు  ? ఇదేదో బాగుందనుకుంటూ మనసున  నెమరేసు కోవడం తప్ప !


          ** ఆమె : లేని పోని ఏ కూని రాగమో ...లేచిరా అంటున్నదీ ....ఆహా 
        * అతడు :ఊరుకొని ఏ వెర్రి కోరికో .... తీర్చవా అంటున్నదీ........
         **ఆమె : కోక ముళ్ళ కూపీ తీసే  కైపు చూపు  కొరుకుతున్నది 
       * అతడు : కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక వెతుకుతున్నదీ 
         ఆమె : ముంచే మైకమా .....మురిపించే  మొహమా !
          స్వేచ్చగా....మన కిష్టమైన రీతిలో .....వచన కవిత్వంలా ....పుంఖాను పుంఖాలుగా  .....టన్నులు కు టన్నులు రాయడం పెద్ద గొప్ప ఏమీ కాదు ! కానీ పాట అనే చట్రంలో పరిమితులకు లోబడి అందమైన సార్వ జనీక భావాన్ని పొందికగా అమర్చడం లోనే వుంది కవి సమర్ధత అంతా ....చమక్కు అంతా !   'క ' గుణింతం తొ  'కబాడ్డి '  ఆడుకుంటూ కవి చూపిన కొంటెతనాన్ని ....జాణతనాన్ని  ( ఇది ఆడవాళ్లకే సొంతం కాదనుకుంటా ) గమనించండి !
      అసలు ...... కోక ముళ్ళ కూపీ తీయాలని ......ఆ కూపీ కూడా కైపు చూపులతో తీయాలని ....ఆ చూపులు తనువును కొరుకుతాయని....ఆ కొరుకుళ్ళు ఆమె గమనిస్తుందని .....ఆ కొరుకుళ్ళు ఇంత కధ కు దారి తీసి మనను కవి తన దారిలోకి  తిప్పుకుంటాడని .....ఎవరైనా ఊహిస్తారా  చెప్పండి  !ఇప్పటికే ఆమె ఆరోపణలకు మనం  'ఒహా.....ఓహో ' అనుకుంటుంటే ......ఆ సంభ్రమాశ్చర్యాల నుంచి మన తేరుకునే లోగానే  ' కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక వెదుకుతున్నవీ ' అంటూ  అమాయకపు ఫోసు కొడుతూ .....ఆ అమాయకత్వాన్ని అలుసు గా చేసుకుని తనకు కావాల్సింది రాబట్టాలను కుంటున్నాడు ! హమ్మ .........ఎంత చతురుడో !
        ఎలాగూ రాబట్టుకోవాలనుకున్నాడు ...........అందుకే పాచిక వేస్తున్నాడు ఇలా..............................................!
                 చేయి వేయనా .....సేవ చేయనా ఓ అనే వయ్యారమా !

ఏమండీ .....అతని కళ్ళకు  మనం ఏమన్నా పిచ్చి వాళ్ళ లాగా కనబడుతున్నామా ఏమిటి ? లేక పొతే ఏమిటండీ .............చెయ్ వేసి ఎవరైనా సేవ చేస్తారు ఆంటే మనం నమ్ముతామటండీ  ? వెనకటి కి  ' మోహిని ' ఇలాగే చేయి వేస్తానని చెప్పి  ' భస్మాసురుడి ' నే భస్మం  చేసేసింది . ఇక్కడా అదే తంతు....అదే గేమ్ ప్లాన్ . చేయి వేస్తానుంటూ చేయి వేసి ..........నరాల నాడీ మండలాన్ని......సున్నితంగా స్పృశించి .......సమ్మోహనంగా సవరించి .....ఆమె వయ్యారాన్ని  'ఓ ' అనిపించాలనే అతని తాపత్రయం .....ఆత్రం కూడానూ !
 పాల ముంచినా నీటముంచినా .....నీ దయే శ్రుంగారమా !

          ఏదేదో అభ్యర్దిస్తున్నట్టుగా కనపడుతుంది  పై పైకి .....కానీ అసలు అంతరార్ధం వేరు . శృంగారం లోకి దిగింతర్వాత .....ఇంకా దయ ఏముంటుంది చెప్పండి ....... ' నిండా మునిగిన వాడికి చలేమిటి ' అన్నట్టు ! బెట్టు చేయ కుండా ఒప్పుకుంటే బాగుండదు కాబట్టి....అలా వేడు కుంటున్నట్టు  గునుస్తుంది.....ఎలాగూ మునక  తప్పదని తెలుసు కాబట్టి....ఆ మునకలో సుఖం ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి   !

అతడు :- ఆగలేని ఆకలేమిటో...పైకి  పైకి దూకుతున్నది  
ఆమె  :- కాలు నేల నిలువకున్నది ....ఆకాశాన తేలుతున్నది 
అతడు :- అంతా మాయగా .....అనిపించే కాలమూ .....**కలయా..నిజమా**

 అనుమతి అంటూ ప్రత్యక్షం గానో  ....పరోక్షం గానో......దొరికిన తర్వాత ఆకలేస్తే ఆబగా ఎలా తింటామో.....తనువాడే మనసాకలి కూడా వాళ్ళపై అలానే దూకుతుంది అది సహజం.....అనివార్యం కూడా !  దాని వల్ల కలిగే రమ్యమైన అనుభూతికి ఎలాగు కాళ్ళు నేలమీద నిలబడవు . ... .....శరీరం గాల్లోనే తేలుతుంది.....! ఆ సమయం లొ కలిగే  కలలాంటి ....ఆ మాయానుభూతి  గురించి  నేను ఇంత కంటే  వేరే  ఏమి చెప్పగలను  ! చతురులైన మీకు ......రసికులైన మీకు ......మల్లెల మత్తును పంచే మరో పాటతో ముందుకు రావడం తప్ప ! 

ఈ పాట సాహిత్యం ఉన్నంత గొప్పగా ....చిత్రీకరణ లేదు . అందుకే పాట తాలూకు వీడియో వుంచడం లేదు !గమనించగలరు !                                            
                                                   భవదీయుడు 
                                                వెంకట రమణ మూర్తి !
        
           

4 comments:

  1. సమాచారం ఆసక్తి కరంగా ఉంది కానీ...
    ' కలయా- నిజమా , తోలి రేయి హాయి మహిమా.... అన్నది ఇళయరాజా' తన సొంత గొంతు తో పాడిన మొదటి తెలుగు పాట కాదు రాజా గారు ఎన్నో పాటల్లో అలాపన అందించారు.ఈ కూలీ సినిమా కంటే చాలా ముందు వచ్చిన మెరుపుదాడి సినిమాలో ‘సందమామ గందమందుకో’పాటను జానకితో కలసిపాడారు,రికార్డుల్లో ఆపాట వినవచ్చు.
    అలాగే ' టాబు ' ను తొలి సారిగా ' హీరొయిన్ ' గా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే ! అన్నవాక్యాన్ని తెలుగు సినిమా హీరోయిన్ గా సరిదిద్దగలరు.తను మొదట హిందీ సినిమా ‘ప్రేమ్’తో కధానాయికగా పరిచయమయ్యింది.

    ReplyDelete
  2. రా్జేంద్ర కుమార్ గార్కి ధన్య్వాదములు. తమరి సూచనల మేరకు సవరించాను.

    ReplyDelete
  3. guruji... debbaki flashback lo ee movie songs anni gurtochaai, paatalu download chesesa

    ReplyDelete
  4. చాలా వ్రాశారు. మీరు "బాగా ఫీలయ్యి".. మమ్మల్ని ఫీల్ చేస్తూ..

    ReplyDelete