Friday, March 19, 2010

మధురమే .........సుధాగానం !

మధురమే.....సుధాగానం !
సుధలూరించే మధురమైన గానానికి పరవశించి...... మరీ చెవి కోసుకొక పోవచ్చు గావి ......చెవిలొగ్గి విని ఆనంద పడని మనిషి ఎవరైనా వుంటారా చెప్పండి ! నేటి తరం కూడా అప్పటి' ఆపాత-మధురాలను 'యెంతగా ఇష్టపడుతున్నారో మనం చూస్తూనె వున్నాము కదా ! ప్రణయ ,విరహ ,బాంధవ్య మరియు సందేశాత్మక పాటలు వింటూ ....మనకి మనం అన్వయించుకుంటూ ....అనునయించుకుంటూ , మనల్ని మనం యెంతగా మర్చిపొతామో వేరే చెప్పాలా ! అలాంటి పాటల్ని మనం ఇక్కడ ముందు ముందు చర్చించుకుందాము !

విని యెలాగూ తరించారు.....ఇప్పుడు చదివి పులకరించండి !
భవదీయుడు
రమణమూర్తి .

************* **************** ***************** *****************
నవ రసాలలో పెద్దపీఠ వద్దన్నా ' శృంగారా నిదే ' !అంతటి మహత్తు గల' అమలిన శృంగారాన్ని' ప్రతిబింబించే ఓ మధురమైన పాట తో ఈ శీర్షికను మొదలు పెడదాం !

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు !

ఘంటశాల -సుశీలమ్మ గొంతులో పలికిన మనోహర మైన పాట అది .
సంగీతం : కె . వి . మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
చిత్రం : దాగుడు మూతలు

అడగగానే ఇచ్చేస్తే అందులో మజా యేముంది ? ప్రేమిచడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్లు ....అడగ కండా ఇచ్చిన మనసే ఎంతో ముద్దు ! అలాగే అందీ అందకుండా వున్న అందమే ముద్దు .అర మగ్గిన జాంపండు అన్నా....అరవిరిసిన మొగ్గ అన్నా ....ఇష్టపడని వారు ఎవరు చెప్పండి ? 'తెలిసి తెలియని మమతే ముద్దు ' . .....అవును నిజమే 'ఇది ఇదీ' అని తెలిసీతెలియని తనం లో వున్న గందరగోళం ....ఆ గందరగోళం లోనుంచి పుట్టిన ఆకర్షణ .....ఆ అకర్షణ ను అదిమి పట్టే మనసు .......మనసు చేసే యుద్ధం....... 'అబ్బో ........ఈ తెలిసీ తెలయని 'మమత ' లలో చాల 'మతలబు ' దాగివుందండీ బాబూ !

అతడు :- నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
ఆమె :- పొగిడి పొగిడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు ..

మగాడి బుద్ధి ఎప్పుడూ .....'అతిశయోక్తి కాదంటూ' .....అతివల అందాలు పొగిడి మరీ బుట్టలో పడేయాలనే అనుకుంటుంది . అందుకే 'సన్నని-పిడికెడు..నడుము' అని తి్న్నగా చెప్పకుండా......'నడకలలో నాట్యం చేస్తుందా ఆ నడుము' అంటూ గుప్పెడు ప్రశంసలు....పిడికెడు ముద్దులు కురిపించాడు.

కాని అమ్మాయి గడుసుదే.....అనుకున్నంత అమాయకురాలేమీ కాదు ! యేమి సమాధానమిచ్చిందో చూడండి. ' నన్ను బులిపించాలని ఎంత పొగిడినా .....యెన్ని చిలిపి పలుకులు పలికినా ....అవి చిటికడంతే ముద్దు ' అంటూ మొహం మీద కొట్టినట్టుగా కాకుండా కాస్త సున్నితంగానే తీసి పారేసింది .

ఇక లాభం లేదు అనుకున్నాడే మో.......పొగిడే భాగాల ను.....పొగడ్తల ఘాటు ను పెంచాడు !
యెలాగో చూడండి !

ఆతడు :- చక-చక లాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు .

''హవ్వ.....హవ్వ్వ''.....అంటూ ఆ కాలం లో ఎంతమంది ఆడవాళ్ళు ...ఎంత మంది పెద్ద వాళ్ళు బుగ్గలు నొక్కుకుని వుంటారో ? ' వీడికిదేం పొయే కాలం - అట్లా అన్నాడూ ' అంటూ తిట్టుకుని మరీ వుంటారు !

లేకపోతే యేమిటండీ ......... ' జడ పెద్దగా వుంది అనో '........' నడుము దాటి మోకాళ్ళ వెనక వరకు వుంది అనో '....'బారెడు పొడుగుతో -క్ర్రిష్ణ వేణి లా వుంది ' అనో .......అనొచ్చు కదండీ ! ఊహు .......ఎలా అన్నా ఫలితం వుండదనుకున్నాడేమో ......తిన్నగా ' పిరుదుల ' దగ్గరెకే వెళ్ళి పోయాడు. సరే వెళ్ళాడే అనుకోండి . 'నడుమూ....జఘనమూ దాటి వేళ్ళాడే అంత పొడుగ్గా వుంది...నీ జడ ' అనొచ్చుగా ! ఊహూ .....అలా కూడా అనలేదు ! యేకంగా .....' చక -చక లాడే................దాటే ' అంటూ ఆమె జఘన సంపద యెంత గొప్పగా వుందో .....చెప్పకనే చెప్పాడు ......చూపుల్తో తడిమి మరీ !
ఇక్కడ కవి ' ఊరువుల ' గురించి అంతలా ఊసెత్తినా .......ముసి నవ్వుల సిగ్గు కాస్త మోమున దోబూచు లాడుతుందే తప్ప ......' చీ ' అనిపించదు . అల్లన ఓ పిల్లగాలి మనసును తాకి వెళ్ళినట్టు వుంటుందే తప్ప అసభ్యమనిపించదు . అదీ అమలిన శృంగారమంటీ !

కానీ తను అంతలా మోహపు పరవశపు మాటలు ఆడినా........మత్తులో తోయాలనుకున్నా ఆమె లొంగిపోలేదు .....పొగడ్తలకు పడి పోలేదు సరి కదా ....... ' నే కోరుకున్నది నీ ప్రేమతో పాటు ....నీ అండ....నీ రక్ష ' ....అంటూ ఏముంటుందో చూడండి !

ఆమె :- కల కాలం తల దాచుకొమ్మనే యెడదను చూస్తే ఎంతో ముద్దు .

విశాలమైన నీ చాతి.....అందులోని విశాల హృదయం ..చూస్తే యెంతో ముద్దు .....అంటూ తన 'security' ని కూడా కోరుకుంది.
ఇక కవి హృదయం .....వాళ్ళ కల్యాణం తో పాటు ....లోక కల్యాణం కూడా కోరింది ! అదెలాగో గమనించండి .

'పచ్చని చేలే కంటికి ముద్దు...నెచ్చెలి నవ్వే జంటకు ముద్దు ' ...అంటూ చెలి నవ్వును జంటకు ఆపాదించడమే కాకుండా ....ఆ నవ్వును 'పచ్చని చేల పచ్చదనం కలిగించే హాయి' తో సమానమంటూ పోల్చాడు. అంతే కాదు ....చెట్టు -చేమా యెలాగైతే ఈ లోకానికి ముద్దో .....మన ఇద్దరం కూడా ఈ జగతికి అంతే ముద్దు అంటూ ముగించాడు !
ఏంత గొప్ప భావనో కదండీ ! 'స్వచ్హమైన ప్రేమ- జంట ల ముద్దులాట ......పచ్హదనాల పైరు- పంట ' జగతికి ఎంత కల్యాణ దాయకమో ! ఇంతగా మనసును తాకేలా......మనల్ని యెక్కడకో తీసుకెళ్ళేలా...... రాసిన ఇలాంటి పాటలను మళ్ళి మళ్ళి వినాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి !

మళ్లీ ఓ మంచి పాట తో కలుద్దాం ( చాంగురే బంగారు రాజా )
మీ అభిప్రాయాలను రాస్తారు కదూ *************!