మెల్ల మెల్ల మెల్లగా.........అణువణువు నీదెగా !
ఆమె :- మెల్లమెల్ల మెల్లగా .......అణువణువునీదేగా !
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా .............!
''మెల్ల మెల్ల మెల్లగా ....ఆణువణువూ నీదేగా ''
సుతారమైన మునివేళ్ళ స్పర్శకు ....మేను సితారలా సవరించబడుతుంటే శరీరం పాడే వలపు సరాగాలను ఏ ఇంతి అయినా ఇష్ట పడుతుంది . మొరటోడు లా ' కబాడ్డీ ' ఆడేస్తా......' t - 20 ' లో లా 'వీర బాదుడు బాదేస్తా ' ఆంటే సుతారమూ ఇష్ట పడడు . తపించే ప్రతి అణువు నీదే...... అని సాధికారంగా పిలుస్తుందీ ఆంటే ....................... ఆ 'సాధికారత' నిండు మనసుతో ....పూర్ణ విశ్వాసం తొ ....తను చేపట్ట బోయే ....వాడి ముందే ఆవిష్కరించబడుతుంది .. ......అందరి ముందు కాదు ! అందుకే.....మెల్ల మెల్ల మెల్ల గా అంటుంది.
ఎంత మెల్లగా ఐతే మాత్రం ' మెల్ల మెల్ల మెల్లగా ' అనుకుంటూ.....పల్లవి నే సాగదీస్తూ .....ఇంత మంద గమనం సాగిస్తే ......ఎప్పటికి అయ్యేను ' అంటున్నారు కదూ ! ఏమి చేయ మంటారు చెప్పండి ?నా కంటే ముందు .....నా పెన్ను ....నా చేతి వేళ్ళు....కీ బోర్డు బటనులు...అన్నీ అణువణువునా ఆ ప్రేమ భావాన్ని వంట బట్టించుకుని ....మొద్దుబారి ......సుతారమూ కదలనని మొరాయిస్తున్నాయి !అందుకే ......ఇంత ఆలశ్యం.....క్షమించండి !
యెంత సాధికారపు హక్కు లేకపోతె .....యెంత సాన్నిహిత్యపు పెంపు లేకపోతె ....అంతలా ఆహ్వానం పలికేలా చెపుతుంది........'' మెత్తగ అడిగితే లేదనేది లేదుగా '' అని. మొదట్లో నేను ' మెత్తగ అడిగితే కాదనేది లేదుగా ' అనుకున్నాను . సరిగా వినలేదేమో అనుకుని మళ్లీ విన్నా .....ఆప్పుడర్ధమయ్యింది ' లేదనేది లేదుగా' అనే వాక్యమే సరి ఐనదని . వాటిలో ఉన్న తేడా అనంతమైనదని ........నిఘూడమైనదని !
కాదనేది లేదుగా ఆంటే.........నేనేమీ 'నో ' అనడం లేదుగా ....అడ్డు చెప్పడం లేదుగా ....అనే అర్ధం వస్తుంది.
కానీ ' లేదనేది లేదుగా ' ఆంటే మాత్రం చాలా లోతైన అర్ధం వస్తుంది ! ఒకటి.............నేను ' లేదు '- ' కాదు ' అనే ప్రశ్నే లేదని ! రెండు .........' నా దగ్గర ఇది లేదు అనే వీలు నీకు లేనే లేదు '........' నేకేమి కావాలో అవన్నీ నా దగ్గర వున్నాయి ' అని అన్యాపదేశంగా ...ధీమాగా... చెప్పడం ఆమె ఉద్దేశం !
ఇదేదో టీనేజ్ లో వుందే పరస్పర ఆకర్షణ తాలూకు అపరిపక్వ మొహా వేశపు పాట కానే కాదు . ఆణువణువూ దగ్గర అయ్యేంత చనువు వున్నదీ ఆంటే .........అది నిండైన ప్రేమ....లోతైన ప్రేమ . ఒకరి మీద ఒకరికి సంపూర్ణ విశ్వాసం ...నమ్మకం ఉంటేనే ఆ స్థిరత్వం వుంటుంది ఆమె పలికే తీరులో.......ఆహ్వానించే రీతిలో !
ఆమె :- నీదికానిదేది లేదు నాలో ....నిజానికీ నీనున్నది నీలో
ఆహా.........ఎంత సరళ మైన భాషలో రాసాడో.........అంత లోతైన భావన లోకి దింపుతాడు ' కవి ' మనల్ని!
అతనికి సంభందించని ......అతనికి చెందని ..... అతని సొంతం కాని ... ....అతనికి హక్కు లేని ...ఏ విషయము , ఏ సంగతి లేనే లేదట ఆమెలో ( భౌతికంగా కానీ....మానసికంగా కానీ ) ! అతనిలో నిక్షిప్తమై ....'' తనే నేను - నేనే తను '' అన్నట్లుగా వుందట. అసలు ఆమె ఉనికే ఆమెకు ప్రశ్నార్ధకంగా ఉన్నప్పుడు ....పాపం ఆమె మాత్రం ఏమి చేయ గలుగుతుంది .
ఆమె ' అచేతన ' అవస్థను గుర్తించినట్టున్నాడు. అందుకే ఇలా అంటున్నాడు !
అతడు :- ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ....ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో ......
అవునూ మరీ ...... '.birds of same feather ' అంటారు చూసారూ ....అలా ఇద్దరిలో అల్లా ఫీలయ్యే మనసుంది కాబట్టే ఇదంతా సాధ్యమయింది . అందుకే ఆ మనసు ఎవరి గుప్పిటిలో చిక్కినా ...ఫలితం ఒకటేగా ! అందుకే అతనలా అనగానే పారవశ్యం తొ కూడిన ఒప్పుకోలుతో ''హా''అంటుంది .
అతడు :- నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మని నిలచినాను .
ఆమె : - దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నీవె నన్ను దోచినావు !
ఈ రెండవ చరణమే నాకు కాస్త తికమకగా అనిపించింది .........ఆమె అనాల్సిన మాటలు అతను .....అతను అనాల్సిన మాటలు ఆమె .....అన్నాడేమో అనిపిస్తుంది . కావలిస్తే మీరు కూడా ఒక్కమారు పరికించండి. దోచు కొమ్మని అతను ......నన్నే నీవు దొచుకున్నావని ఆమె ......మొత్తానికి ఒకరిని చూచి ఒకరు.....ఒళ్లుమరచి ....ఒకరి చేత ఒకరు దోచుకోబడ్డారు !
పడరు మరీ........వాళ్ల సొమ్మేం పోయిందని ........ఆ దోచుకోబడడం లో ఏమన్నా నష్టం ఉంటేగా .....ఇద్దరికీ లాభమేనాయే!అందుకే దోచుకున్నా...దోచుకోబడ్డా .....దాచుకున్నా....... వాళ్ళకే చెల్లింది !
అసలు ఈ అవస్తకు కారణం .........మనకు ఇంత కాల నష్టానికి కారణం ......మొత్తం అంతా చివరి చరణం లో వుందని ......విప్పాడు ''గుట్టు '' .... కవి మన మనసుకు తాకేట్టు ! . ఎలాగో చూడండి !
ఆమె :- కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు.....కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు.
చూసారా......చూసారా.... కవి చమత్ర్క్రుతి ? అయ్యలారా.....అమ్మాలారా ....అసలే ' ప్రేమ గుడ్డిదీ '........అంటారు . ఆపై ' కళ్ళకు గంతలు కూడా కట్టారాయే ....ఇంకా ఏం కనపడుతుంది చెప్పండి . మామూలు గానే ' కన్నె మనసు' దాగుడు మూతలు ఆడుతుంది. కళ్ళకు కట్టిన గంతల నెపం తో మరింత కాస్త ఎక్కువగా ఆడుతుంది........అని చెప్పకనే చెప్పారు .....మన ' మనసు కవి ' ఆచార్య ఆత్రేయ గారు ! అందుకే చివరకు ఇలా అంటున్నారు .......హీరో గొంతుకతో !
అతడు :- దొరికినాము చివరకు తోడుదొంగలం......దొరలమై ఏలుదాం వలపు సీమనూ ................!
కింద పడ్డా ...పై చేయి ఆంటే ఇదే ! ఈ బ్లాగు చదివిన అందరిముందు '' మనం తోడుదొంగలమై - పట్టు పడి పోయాము '' అంటూనే .....దొరలమై ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తామంటున్నారు . మనం అడ్డు పడ్డా ఆగుతారా ? వాళ్ల ప్రణయ సామ్రాజ్యం లో వాళ్ళని మునగనీయండి ! మళ్లీ మనం ..... ఇంకో పాటతో కలుసుకొనే దాకా ......వాళ్ళనలా వదిలేద్దాం !
సెలవా మరి! భవదీయుడు !
రమణ మూర్తి
చిత్రం ;- దాగుడు మూతలు
రచన :- ఆచార్య ఆత్రేయ
సంగీతం :- కే .వి . మహ దేవన్
పాడినది:- ఘంటసాల , సుశీల .
నమస్కారం సార్,
ReplyDeleteమీ బ్లాగ్ చాలా చాలా బాగుంది. చదివిన తర్వాత ఒక రకమైన అలౌకిక ఆనందానం పొందాను.ఎదిఏమైనా ఇంత మంచి బ్లాగును నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు.
మీకు నా ధన్యవాదములు!
ReplyDeleteశ్రుతి మించి రాగాన పడుతున్నానా......' పెద్దలకు మాత్రమే ' అనే కేటగిరీ లోకి ఇది చేరిందా....? .....అని మధన పడుతున్న వేళలో .......మీ లేఖ కొండంత ఊరటను ,బలాన్ని ఇచ్హింది !ఆపుదామా....అనుకున్న నేను మళ్ళి రాయాలనిపించేంతగా ...మార్చిన మీకు మరో సారి ధన్యవాదములు.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteసార్,
ReplyDeleteథాంక్స్ ఫర్ యువర్ ఇమ్మిడియేట్ రిప్లై
నేను బెనర్జీ మిత్రుణ్ని.
నేను డైరెక్ట్ గా తెలుగు లో మీకు మీ బ్లాగ్ నుంచే ఎలా సమధానం ఇవ్వాలో తెలియ చేయగలరు. వీలైతే నాకు ఒక్కసారి ఫోను (9440476537) చేయండి.
Wow Ramana Murthy
ReplyDelete